నల్గొండ కార్పొరేషన్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 

నల్గొండ కార్పొరేషన్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 

నల్గొండ, వెలుగు: నల్గొండ  మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడంతోపాటు బెస్ట్ కార్పొరేషన్ అవార్డు కూడా అందుకుంటామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం ఇందిరాభవన్ వద్ద నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిశుభ్రతకు సంబంధించి రూ. కోటితో ఏర్పాటు చేసిన రెండు వెట్టింగ్ మెషిన్లను ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల నల్గొండ కార్పొరేషన్  స్వచ్ఛ అవార్డు అందుకుందని, నూతనంగా ఏర్పాటైన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. 24 గంటలు తాగునీరు అందించేందుకు రూ.83 కోట్లతో టెండర్లు కూడా పిల్చినట్లు చెప్పారు. కార్పొరేషన్​లో ఎస్డీఎఫ్ నిధులతో 63 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని, మిగిలిన డివిజన్లలో కూడా రోడ్లు,  డ్రైన్లు నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. 

విద్యార్థుల జీవితాలు మార్చేది గురువులే.. 

విద్యార్థుల జీవితాలు మార్చేది గురువులేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన  కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా  విద్యార్థుల నమోదు శాతం 10 శాతం తగ్గగా, నల్గొండ జిల్లాలో మాత్రం 9శాతం పెరిగిందని,ఇది జిల్లా ఉపాధ్యాయుల  పనితీరుకు నిదర్శనమన్నారు. నల్గొండలో రూ.200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 12,000 మంది టీచర్ లను కొత్తగా నియమించిందని, అవసరమైతే మరికొంతమందిని నియమిస్తుందని చెప్పారు. టెన్త్​ స్టూడెంట్స్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలని సూచించారు. కలెక్టర్ బి .చంద్రశేఖర్, ఎస్పీ శరత్​చంద్ర పవర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మేయర్  బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.